డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి. IAS
(ఆంగ్లం: Dr. Enugu Narasimha Reddy)
డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి తెలంగాణకు చెందిన కవి, రచయిత, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు. 2017 నుండి 2020 వరకు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి కార్యదర్శిగా పనిచేశారు . ప్రస్తుతం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆయన అంతకుముందు మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్‌గా, మహబూబ్‌నగర్ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహించారు.
జననం మరియు విద్య
ఏనుగు నరసింహారెడ్డి గారు 1968 ఏప్రిల్ 6వ తేదీన ఏనుగు కృష్ణారెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కల్లోనికుంట గ్రామంలో జన్మించారు .
ఆయన జన్మించిన మూడేళ్లకు తండ్రి కృష్ణారెడ్డి టీబీ వ్యాధితో మరణించగా, తల్లి లక్ష్మమ్మ నరసింహారెడ్డిని తీసుకొని హైదరాబాదు (తార్నాక)కు వెళ్లారు . అక్కడ ఇబ్బందులు ఎదురుకావడంతో చిట్యాలకు వచ్చి స్థిరపడ్డారు .
నరసింహారెడ్డి చిట్యాలలో పదవ తరగతి, రామన్నపేటలో ఇంటర్ విద్య పూర్తి చేసి, సికింద్రాబాద్ లోని సర్దార్ పటేల్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం, నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండవ మరియు మూడవ సంవత్సరం చదివారు . ఆ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ, తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్, పీహెచ్.డి చేశారు
వ్యక్తిగత జీవితం
డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న సమయంలోనే నరసింహారెడ్డికి తన మేనమరదలు అరుణతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు — తేజస్విని మరియు గీతాంజలి.







ఉద్యోగం
పీహెచ్.డి చదువుతున్న సమయంలో ఏపీపీఎస్సీ గ్రూప్-2ఎలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ ర్యాంకు సాధించి, ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దారుగా ఉద్యోగం ప్రారంభించారు. తరువాత జేఆర్ఎఫ్ కు రాజీనామా చేసి పీహెచ్.డీ కొనసాగించారు .
మెదక్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో వివిధ స్థాయిలో పనిచేశారు . తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా, తెలంగాణా ప్రభుత్వం ఘనంగా హైదరాబాదు లో నిర్వహించిన 5 వ ప్రపంచ తెలుగు మహాసభలను సహిత్య కార్యదర్శిగా ఘనంగా సమర్థవంతంగా నిర్వహించారు
సాహిత్య ప్రస్థానం
స్కూల్ లైబ్రరీలో రష్యన్ మరియు బెంగాలీ అనువాదాలు, కుప్రీన్, టాల్‌స్టాయ్, తుర్గనేవ్ రచనలు చదివి, చిన్న వయసులోనే సాహిత్యపు మాధుర్యాన్ని ఆస్వాదించారు. విద్యార్థి దశలోనే పల్లె జీవనంపై “మట్టిపాట” పేరుతో ఒక శతకం రచించారు. అది వారి సాహిత్య పయనం మొదటి అడుగు.
పదవ తరగతిలో ఉన్నప్పుడు బాలల మాసపత్రిక నిర్వహించిన నవల పోటీలో 120 పేజీల “ఊరు మారింది” అనే నవల రాసి పంపారు. తర్వాత “సినీయాక్టర్‌ని” అనే నవలతో తన సృజనాత్మక ప్రతిభను మరింతగా చూపించారు. 1983లో “పాఠశాల” అనే విద్యార్థి పత్రికకు శ్రీనాథ మహాకవిపై రాసిన వ్యాసానికి మొదటి బహుమతి లభించింది. ఆటలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో చురుకుగా పాల్గొంటూ తొమ్మిదో తరగతిలో విద్యార్థి సంఘ కార్యదర్శిగా, పదో తరగతిలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఇంటర్ చదువుతున్న సమయంలో యువవాణి కార్యక్రమంలో కవిత్వం చదవడానికి అవకాశం పొందారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన పురాణ ప్రబోధ పరీక్షలో జిల్లా ఫస్ట్ ర్యాంకుతో రజత పతకం అందుకున్నారు. డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు రచించిన “పగిలిన గుండెలు” నవల, ప్రజాపోరాటం సాయంకాల దినపత్రికలో రెండున్నర నెలలపాటు డైలీ సీరియల్‌గా ప్రచురించబడింది. ఈ సాహిత్య యాత్రలో, కవి, రచయిత, విమర్శకుడిగా ఆయన సాధించిన స్థానం తెలంగాణ సాహిత్య ప్రపంచానికి ఒక గర్వకారణం.
తెలంగాణ రుబాయిలు, హైదరాబాద్ విషాదం, కొత్త పలక అనే విభిన్నమైన సాహిత్య సృజనలతో ఏనుగు నరసింహారెడ్డి తెలంగాణ సాహిత్యం పై తనదైన విశేషముద్రవేశాడు. కవిగా వచన కవిత్వాన్ని రుబాయిలను, చందోబద్ధ పద్యాలను సాధికారికంగా రాయగలిగిన అరుదైన తెలుగు కవులలో ఏనుగు నరసింహారెడ్డి ఒకడు. ఆయన రాసిన మట్టి పాట శతకం పల్లె జీవిత దైన్యాన్ని కళ్ళకు కట్టడంతో దేశపతి శ్రీనివాస్ స్వరంలో దీర్ఘ గేయంగా వచ్చింది. ఏనుగు నరసింహారెడ్డి రాసిన తెలంగాణ రుబాయిలను అనేక మంది ఔత్సాహిక గాయకులు తమదైన స్వరంలో పాడి వీడియోలు అద్ది యూట్యూబ్లో పదిలపరుచుకున్నారు. చిన్న కవితల సంపుటిగా తీసుకువచ్చిన పూల పూల వాన ను తెలుగు సమాజం ఎంతగానో ఆదరించింది.
కవిమీద పుస్తకం
అరతెర తీసిన రంగస్థలం – గుడిపాటి
గురిజాల రామ శేషయ్య సంపాదకత్వం లో ఏనుగు నరసింహారెడ్డి సాహిత్యాంతరంగం కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి
తెరపి లేని వాన – పెరుమాళ్ళ ఆనంద్
డా. సాగర్ల సత్తెయ్య, డా.మండల స్వామి , డా. ఉప్పల పద్మ
రుబాయీలు : పక్రియ, తత్వము డా. సీతారం
సంపాదకత్వం
ములాఖత్ – కవితా సంకలనం
గునుగుపూల పొద్దు – కవితా సంకలనం
దిగులు వెన్నెల – కవిత సంకలనం
అదే కల – కవితా సంకలనం
తెలంగాణ చారిత్ర సంస్కృతి
అస్తిత్వ
పరంపర
అనువాదం
మూలమలుపు కవితా సంపుటి A BEND IN THE CORNER గా ఇంగ్లీష్ లోకి అనువాదం – సాయి చంద్రమౌళి
కొత్త పలక కవితా సంపుటి THE WHEEL OF TIME గా ఇంగ్లీష్ లోకి అనువాదం – డా.మంతెన దామోదరాచారి
